తెలుగులో ప్రాచీన కాలంలో సరే, ఆధునిక కాలంలో కూడా కవయిత్రులు ఎక్కువ మంది కనిపించరు.
కవిత్వం వ్రాయగలిగినంత ప్రతిభా వ్యుత్పత్తులు స్త్రీలకు లేకపోవటమే కవిత్వరంగంలో స్త్రీలు కనిపించకపోవటానికి కారణమన్న అభిప్రాయం వుంది.
ప్రతిభా వ్యుత్పత్తుల సంపాదనకు పురుషులకున్నంత అవకాశాలు ఈ సమాజంలో స్త్రీలకు లేవన్నది ఒక నిష్ఠుర వాస్తవం. అయినా బ్రిటిషు వలస పాలన వలన వచ్చిన ఆధునిక ప్రజాస్వామిక వ్యవస్థలు, చైతన్యం, సంఘసంస్కరణోద్యమం వలన కలిసి వచ్చిన విద్యావకాశాలు కూడా స్త్రీలకు కవిత్వరంగంలోకి ప్రవేశాన్ని కల్పించలేక పోయాయా? స్త్రీలు కవిత్వం వ్రాసినా వాళ్ళకు గుర్తింపు రాలేదా? రాకపోవటానికి కారణాలు ఏమిటి? - ఆధునిక తెలుగు కవిత్వ చరిత్రలో భావకవిత్వ శాఖకు ప్రతినిధులుగా చావలి బంగారమ్మ, తల్లాప్రగడ విశ్వసుందరమ్మ, బసవరాజు రాజ్యలక్ష్మి (సౌదామిని) - ముగ్గురు, జాతీయోద్యమ కవిత్వశాఖలో కాంచనపల్లి కనకాంబ, న్యాయపతి వెంకట విజయలక్ష్మమ్మ, వీరపనేని సరోజిని, కనుపర్తి వరలక్ష్మమ్మ, వక్కలంక రమాబాయి, మొదలైన కొద్దిమంది పేర్లు, అభ్యుదయ కవిత్వశాఖలో వట్టికొండ విశాలాక్షి వంటి ఒకరిద్దరి పేర్లు మాత్రమే వినబడుతుంటాయి, ప్రస్తావించబడుతుంటాయి. వీళ్ళ కవిత్వమైనా సమగ్రంగా ఒక దగ్గర సంపుటీకరించబడలేదు. కవిత్వ చరిత్ర రచనకు అందుబాటులో లేదు.
ఇక ఈ మూడు ధోరణులలో కాక ఇతరత్రా వివిధ విషయాలపై స్త్రీలు వ్రాసిన కవిత్వం అసలు లెక్కలోకి రాకుండానే పోయింది. తెలుగులో కవుల చరిత్రలు, వాఙ్మయ చరిత్రలు ఎన్నో వచ్చినా స్త్రీల కవిత్వం గురించిన ప్రస్తావన కూడా వాటిలో లేకపోవటం ‘’స్త్రీలలో సరియైన రచయితలు, కవయిత్రులు లేరని చెప్పటానికి విచారిస్తున్నాము'’ అని సాహిత్య చరిత్రకారులు బాధ్యతారహితంగా మాట్లాడటం, పసగల కావ్యాలు సృజించిన కవయిత్రులు పట్టుమని పదిమందైనా లేరు అని స్త్రీల కవిత్వాన్ని తక్కువగా చేసి, కవిత్వం వ్రాసిన స్త్రీలను నిర్లక్ష్యం చేసి మాట్లాడటం - విని విని వాటిపై విమర్శగా, సమాధానంగా ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ 1951లో ‘ఆంధ్ర కవయిత్రులు’ అనే గ్రంథాన్ని రచించింది. స్వాతంత్య్రానికి పూర్వపు కవయిత్రులే ఎక్కువగా ఈ గ్రంథంలో కనబడతారు. అయినా ఇది తొలి ప్రయత్నమే. ఉన్నంతలో సమగ్రమే కానీ సంపూర్ణం కాదు. లక్ష్మీకాంతమ్మ, దాదాపు అరవయ్యేళ్ళ క్రితం తెలుగు కవయిత్రుల చరిత్ర వ్రాయటానికి చేసిన ప్రారంభ ప్రయత్నాలను ఆ తరువాత ఎవరూ అందిపుచ్చుకొనలేదు. ఇక కథ, నవల, వ్యాసం, నాటకం, పాట మొదలైన సాహిత్య ప్రక్రియలలో మహిళలు చేసిన కృషి గురించి ఆలోచించినదెవరు? మదింపు చేసినదెవరు?
ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ స్పూర్తితో ఇన్నాళ్ళు మహిళా వాఙ్మయానికి జరిగిన తీరని అపచారానికి పరిహారంగా స్త్రీల కవిత్వ చరిత్ర రచనను, స్త్రీల కథాసాహిత్య చరిత్రను, స్త్రీల నవలా సాహిత్య చరిత్రను, స్త్రీల వ్యాస వాఙ్మయచరిత్రను, స్త్రీల నాటక సాహిత్య చరిత్రను, స్త్రీల గేయ వాఙ్మయ చరిత్రను సమాంతరంగా నిర్మించుకొనటానికి మనమిప్పుడు సంకల్పించాలి. ఆ క్రమంలోనే ‘స్వాతంత్య్రానికి పూర్వం తెలుగు కవయిత్రులు’ అన్న ఈ ప్రసంగపత్రం సిద్ధం చేయబడింది. ఇందుకై పరిశీలించిన కవులు 115 మంది. 1929 నుండి 1946 వరకు పద్దెనిమిదేళ్ళ కాలం మీద గృహలక్ష్మి, తెలుగు తల్లి, భారతి పత్రికలను అప్పుడప్పుడు, అక్కడక్కడా పరిశీలించి గుర్తించిన కవులు వీళ్ళు. వీళ్ళలో ఎక్కువమంది గృహలక్ష్మి పత్రికకు వ్రాసినవాళ్ళు. స్త్రీల ఆరోగ్య సౌభాగ్యములను పెంపొందించుటకు కె.ఎన్. కేసరి ఏర్పరచిన ఈ స్త్రీల పత్రిక స్త్రీలను ఎందరినో రచయితలుగా, కవులుగా ఆవిష్కరించిందనటంలో అతిశయెక్తి లేదు.
స్వాతంత్య్రానికి పూర్వం కవయిత్రులు ప్రధానంగా పద్యాలు వ్రాశారు. సమస్యాపూరణ పద్యాలు వ్రాయటంలో ఉత్సాహంగా పోటీపడిన పరుచూరి భువనేశ్వరి, సామవేదుల చిరంజీవమ్మ, బెల్లంకొండ కనకమ్మ, యేలరి పాటి లక్ష్మీ సరస్వతి, కె. రామసుబ్బమ్మ, ఆరాధ్యుల వేంకట సుబ్బలక్ష్మి, భాగవతుల వేంకట జోగమాంబ, దేశరాజు భారతీదేవి, పేరేపు మహాలక్ష్మి, హరిలక్ష్మి దేవి, పిండిప్రోలు కొండమాంబ, గండికోట సావిత్రీదేవి, వడ్లపూడి శేషారత్నం, ఆతా సూర్యకాంతం, గంటి కామేశ్వరమ్మ, శేషమాంబ, సామినేని హనుమాయమ్మ, సామవేదం సీతారామమ్మ, యం. రామలక్ష్మమ్మ, ఎమ్. వేదపల్లి తాయరమ్మ, ఆచంట సత్యవతమ్మ, పంతుల సీతాలక్ష్మి, కనుపర్తి వరలక్ష్మమ్మ, వనాప్రగడ సీతారామమ్మ, కర్రి కమల మొదలైన స్త్రీలు ఉన్నారు. మదమంచి అనంతమ్మ మాంచాల, నాయకురాలు అనే పద్య కావ్యాలను వ్రాసింది. సీరము సుభద్రయంబ రామాయణం వ్రాసింది. కాంచనపల్లి కనకాంబ జీవయాత్ర అనే ఆధ్యాత్మిక కావ్యం వ్రాసింది. గుడిపూడి ఇందుమతీదేవి అంబరీష విజయం, లక్షణా పరిణయం వంటి ప్రబంధాలు వ్రాసింది. ఇట్లా మహాకావ్య రచనోత్సాహంతో కృషిచేసిన స్త్రీలు స్వాతంత్య్రానికి పూర్వమే ఎందరో వున్నారు. ఇక వారు శతక రచన కూడా విస్తృతంగానే చేశారు. గుడిపూడి ఇందుమతీదేవి తరుణీశతకం, రాజరాజేశ్వరి శతకం, నారసింహ శతకం, అయితం ఇందిరా భారతులు జననీ శతకం, గంటి కృష్ణవేణమ్మ, కౌయిట్లాధిప చెన్నకేశవ శతకం, జ్ఞాన ప్రసూనాంబికా శతకం, కాంచనపల్లి కనకాంబ సింహపురి రంగశతకం, కొటికల పూడి సీతమ్మ సాధురక్షక శతకం - ఇలా ఎందరో స్త్రీలు ఎన్నో శతకాలు రచించారు. ఇవన్నీ చెప్పటమెందుంటే స్త్రీలు ప్రతిభావ్యుత్పత్తులలో ఎక్కడా వెనుకబడి లేరన్న విషయాన్ని స్థాపించటానికే. స్త్రీల అధ్యయనానికి, ఆర్తికి, సృజన శక్తికి నిదర్శనంగా ఈ సాహిత్యం కనబడుతుంది. 1929 అక్టోబరు గృహలక్ష్మిలో సంపాదకులు కె.యన్. కేసరి గుడిపూడి ఇందుమతీదేవిని పరిచయం చేస్తూ ‘’పురుషులకు కూడా పరవశ్చర్యము పొడమునట్లు గ్రంథరచన చేసిన కాంతామణి'’ అని చెప్పిన మాటలు చాలా మంది కవయిత్రులకు వర్తించేవే. వీరినుండి పాతిక మంది కవయిత్రులను ఒకటికంటే ఎక్కువ కవితలను వ్రాసిన వారిని గుర్తించి వారి కవిత్వంపై కేంద్రీకరించి ఈ పత్రం రూపొందించటం జరిగింది.
ఈ కాలపు స్త్రీలకు కవితా సామగ్రి చాలావరకు పురాణేతిహాసకావ్య మూలాల నుండి లభించింది. లేదా స్థానిక దైవతా విషయాలు కావ్య వస్తువును సమకూర్చాయి. లేదా వారి లౌకిక జీవితాన్ని నియంత్రించిన స్త్రీ జీవనధర్మ సత్రాలు ఒక ఆదర్శంగా వాళ్ళ కావ్య వస్తువును నిర్దేశించటం కనిపిస్తుంది.
లౌకిక ప్రపంచంలో, మానవ సమాజంలో విస్తృతమైన వస్తు సంపద, విశిష్టమైన జీవన సంబంధాలు ఉన్నాయి. ఒక్కొక్క మనిషికి ఉండే ప్రత్యేక పరిస్థితుల వల్ల ఈ ప్రపంచంలో ఈ సమాజంలో ఒక్కొక్క భాగంతో సన్నిహిత సంబంధం ఏర్పడుతుంది. కొంతభాగం ఎప్పటికీ తెలియనిదిగానే మిగిలిపోతుంది. తెలిసిన దానిని బట్టే భావనా ప్రపంచం వికసిస్తుంటుంది. స్త్రీలకు తరతరాలుగా నిర్దేశించబడి ఉన్న కుటుంబ జీవన పరిమితులు, తరచు వాళ్ళను అతిచిన్న లౌకిక ప్రపంచ పరిధులలో పరిభ్రమించేటట్లు చేస్తాయి. ఆ మేరకు వాళ్ళ భావనా ప్రపంచం కూడా చిన్నదిగానే ఉంటుంది. తత్ఫలితంగానే స్త్రీల కవితా వస్తు ప్రపంచం పరిమిత పరిధిలోనే ఉంటుంది. సంప్రదాయ సమాజం స్త్రీకి కుటుంబం పట్ల ఏ ధర్మాలను అనుసరించదగినవని చెప్పిందో ఆ ధర్మ నిర్వహణలో భాగంగా ఏ నోములు, వ్రతాలు, పండుగలు చేయాలని సూచించిందో అవే ప్రాథమికంగా స్త్రీల కవితా వస్తువు కావటం దీనినే ఋజువు పరుస్తుంది.
గుడిపూడి ఇందుమతీదేవి వ్రాసిన తరుణీశతకం, నీతి తారావళి స్త్రీలకు తొందరపాటు, కోపం ఉండకూడదు అని, ఇల్లు దిద్దుకునే నేర్పు, పతివ్రతా తత్వం ఉండాలని బోధిస్తాయి. దేశిరాజు భారతీదేవి కాంతా శతకంలో ఇహపరాలు రెండింటికి స్త్రీకి పతియే గతి అని చెప్పింది. పాటి బండ వేంకట అలమేలు మంగతాయి - గృహిణి అంటే పొద్దున్నే లేచి ఉత్సాహంతో ఇంటిని తీర్చిదిద్ది శుభ్రమైన వస్త్రాలు ధరించి తేనెలూరు మాటలాడుచు శుభాలు చేకూర్చాలని సూచించింది. మదిన సుభద్రమ్మ ‘’బోజ్యేషు మాతా శయనేషు రంభా'’ అన్న ప్రాచీన వాక్కును దృష్టిలో పెట్టుకొని భార్యధర్మాలను నిర్వచించింది.
‘’ఘనపరిచర్యలందు దగుకార్యములందును, ధర్మసంగరం
బున శయనించు వేళలను భోజన కాలమునందున నీ క్షమా
గుణమున దాసి, మంత్రియును, కూలియు, రంభయు, దల్లి ధాత్రిలా
గున జరియించు భార్యకులగోత్రములెంతయు నుద్దరించెడున్.'’ - (గృహలక్ష్మి అక్టోబరు 1929)
అయ్యదేవర బాలా త్రిపుర సుందరమ్మ పతివ్రత ధర్మములు అన్న శీర్షిక కింద వ్రాసిన పద్యాలలో భర్తకు సేవ చేయమని, ఇంటిపనులు చేయమని అతిధులను ఆదరించమని ఇరుగు పొరుగు ఇండ్లకు వెళ్ళి ముచ్చట్లతో కాలక్షేపం చేయక చదువుకొనమని ప్రబోధించింది. (గృహలక్ష్మి ఆగష్టు 1929) గిడుగు లక్ష్మీకాంతం, జొన్నలగడ్డ శారదాంబ వదిన మరదళ్ళు జంటకవులు. లక్ష్మీ శారదాకుమారీ నీతిశతకం వారి రచనలలో ఒకటి. కూతుర్ని అత్తగారింటికి పంపేటప్పుడు చేసే హితబోధ ఇందులో విషయం. భర్త మనోగత భావాలను గ్రహించి అతనికి సంతోషం కల్గేటట్లు ప్రవర్తించమని చెప్పటం, భర్త చెడు వర్గాలకు పోతే ధైర్యం కోల్పోకుండా చతురతతో మంచి వర్గానికి త్రిప్పుకొమ్మని బోధించటం ఈ శతకంలో కనబడ్తుంది. ఈ విధంగా స్వాతంత్య్రానికి పూర్వం కవయిత్రులు సంప్రదాయ వర్గంలోనే స్త్రీ ధర్మాలను నిర్వచించారు. అంటే స్త్రీ గురించిన సంప్రదాయ భావననే ఆమోదించి ఆ పరిధిలోనే ఆదర్శ స్త్రీకి ఒక నమూనాను తమ కవిత్వంలో రూపొందించారు.
స్త్రీల గృహజీవితం భర్తను సుఖపెట్టటానికే. ఆ ఆదర్శాన్ని సాధించటానికి అనుగుణంగా స్త్రీల నిత్య జీవిత భౌతిక క్రియకలాపమంతా రూపొందించబడింది. భర్తను సుఖపెట్టటమే కాదు, భర్త సంక్షేమంలోనే స్త్రీకి ఉనికి, భద్రత ఉన్నాయన్న భావజాలాన్ని నిర్మించింది పితృస్వామిక సమాజం. అందువల్లనే భర్త సంక్షేమాన్ని తమ సౌభాగ్యాన్ని కోరి స్త్రీలు వ్రతాలు, నోములు చేయటం కూడా స్త్రీ ధర్మమే అయింది.
నోములలో శ్రావణ మాసం నోములు చాలా ముఖ్యమైనవి. పెళ్ళైన సంవత్సరం నుండి ప్రారంభించి ఐదు సంవత్సరాలు శ్రావణ మంగళ వారం నోములు స్త్రీలు నోచుకుంటారు. శ్రావణ మాసపు రెండవ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం జీవితకాలం చేసుకోవల్సినది. 1930ల నాటి స్త్రీల జీవితం ఈ శ్రావణమాసపు నోముల చుట్టు ఎంతగా అల్లుకొని పోయిందో స్త్రీల కవిత్వం చూస్తే స్పష్టమవుతుంది. మొగసాటి అప్పల నర్సమ్మ - శ్రావణ మాసాన్ని ఒక స్త్రీగా మానవీకరించి చెప్పిన పద్యంలో ఈ దృష్టిని గమనించవచ్చు.
‘’ పుణ్యాంగనలు నీవెపుడు వత్తువోయని దినము వ్రేళ్ళను లెక్క గొనుదురమ్మ
వరలక్ష్మీ పూజలు వ్రతములెప్పుడటంచు సంతోషమున ముచ్చటింతురమ్మ
మంగళప్రదమైన మంగళ శుక్రవారము లెప్పుడని లెక్క వ్రాతురమ్మ
పండుగ వేడుకల్ ప్రకృతి సౌందర్యంబు రాజిల్లుగాదె నీ రాకనమ్మ'’ (గృహలక్ష్మి ఆగష్టు 1931)
స్త్రీలు శ్రావణమాసం కోసం చూసే ఎదురు చూపులు, మంగళ, శుక్రవార వ్రతాలు చేసుకొనటం పట్ల చూపే ఆసక్తులు ఇందులో వర్ణింపబడ్డాయి. ఈ శ్రావణ మంగళ వార, శుక్రవార పూజా ఉత్సవాలను ‘’హైందవాచార సంప్రదాయనుబద్ధ ధర్మములు'’ అంటుంది రాజేశ్వరి అనే కవయిత్రి. కనుక నారీమతల్లులకు అవి సదా ఆచరణీయములు అని చెపుతుంది. ‘’వానినెన్నటికి వీడరాదు సుమి కుమారీ'’ అని హెచ్చరిస్తుంది.
సంఘసంస్కరణోద్యమంలో ప్రధానాంశం స్త్రీ విద్య. 1870ల నాటికే వీరేశలింగం పంతులు వంటి వారి కృషితో ఆంధ్రదేశంలో స్త్రీ విద్య ఉద్యమం విస్తరించింది. స్త్రీకి విద్య అవసరమా? కాదా? అవసరమైతే స్త్రీకి ఎటువంటి విద్య ఇవ్వదగినది అనే విషయాల మీద చర్చోపచర్చలు జరిగాయి. పాతిక ముప్పై సంవత్సరాల సంఘర్షణ సంవాదాల చరిత్ర క్రమంలో స్త్రీ విద్య ఒక మేరకు ఆమోదితాంశం అయింది. స్త్రీలు స్వయంగా సంఘాలు పెట్టుకొని స్త్రీ విద్యకు అనుకూలంగా స్త్రీ సమాజాన్ని చైతన్య పరిచే ప్రయత్నం మొదలైంది. ఇంత జరిగిన 30 ఏళ్ళ తర్వాత కూడా స్త్రీ విద్య స్త్రీలకు పెద్దగా కవిత్వ వస్తువు కాకపోవటం ఒక చేదు వాస్తవం.
ఉన్నంతలో భువనగిరి లక్ష్మీకాంతమ్మ వ్రాసిన స్త్రీ విద్య అన్న ఖండకావ్యం ఒకటి కనిపిస్తుంది. స్త్రీలకు బాల్యములోనే స్త్రీల చరిత్రలు చెప్పాలని అంటుంది ఈ కవయిత్రి. ఐతే ఆ చరిత్ర శీలరక్షణకై ప్రాణాలు వదిలిన స్త్రీల చరిత్రగా ఉండాలని ఆమె ఆశించటం గమనించదగినది. అట్లాగే ఆమె మరొక పద్యంలో ఎన్ని విద్యలు నేర్చుకున్నా దుశ్శీల పథం పట్టిన స్త్రీలకు గౌరవం అబ్బదు అని అంటుంది. శీలం ముఖ్యమైనదని చెప్పటమే విద్య నేర్పించేటప్పుడు అనుసరించవల్సిన ధర్మమని ఆమె అభిప్రాయం. స్త్రీ విద్య గతానుగతికమైన, సాంప్రదాయమైన శీలం అన్న విలువకు అనుబంధంగా మాత్రమే చూడబడ్తున్న స్థితిని ఇది సూచిస్తుంది.
ఐతే ఈ సంప్రదాయ పరిమితులలో కూడా స్త్రీలు సమకాలపు సామాజిక, రాజకీయ ఉద్యమాలవైపు తమ చూపును ప్రసరింప చేయటం విశేషం. హరిజన సమస్య, శ్రామిక వర్గపు సమస్య స్త్రీల కవిత్వ వస్తువు కావటం, వాళ్ళు కుటుంబ పరిథులను దాటి బయటి ప్రపంచాన్ని నిర్వచించటానికి, నిర్మించటానికి సంసిద్ధమవుతున్న స్థితిని సూచిస్తుంది. మదమంచి అనంతమ్మ పల్లెపదాలు అనే శీర్షికతో వ్రాసిన పద్యాలలో (గృహలక్ష్మి మార్చి 1931) గడ్డిమోపును తెస్తున్న మాల స్త్రీని వర్ణించింది. ఆమె కష్టాన్ని గుర్తించి సంసారి పిల్లను ఆమెకు సాయంచేయమని చెప్పటం కనిపిస్తుంది.
పరుచూరి భువనేశ్వరీ దేవి - హరిజన సమస్యను కవితా వస్తువుగా చేసుకున్నది.
‘’కడుపునిండార త్రాగంగ గంజిలేదు
కట్టుకొనుటకు చింపిరిబట్ట లేదు
నిద్రవచ్చుచో జానెడు నేల లేదు
దీన హరిజన స్థితియిదె తెలుగు బిడ్డ'’
(గృహలక్ష్మి 1932 మార్చి)
అని తెలుగు వాళ్ళను హరిజన సమస్యపై చైతన్యవంతులను చేయటానికి కవిత్వాన్ని సాధనంగా చేసుకొన్నది. హరిజనుల సామాజిక దైన్యాన్ని, ఆర్థిక దైన్యాన్ని గుర్తించిన ఈ కవయిత్రి కులభేదంతో పనిలేకుండా తెలుగువాళ్ళందరు సోదరులేనని భావించింది. హరిజనులను సాటివారిగా గుర్తించాలని సహభావాన్ని ప్రబోధించింది. గాంధీ ప్రారంభించిన హరిజనోద్యమాన్ని గురించిన చైతన్యం కూడా ఈ కవితా ఖండికలో ప్రతిఫలించింది. హరిజనుల సమస్య పట్ల ప్రజలలో సహానుభూతిని పెంపొందించటం కోసం, ప్రజాభిప్రాయన్ని సమీకరించటం కోసం గాంధీ నిర్వహించిన చారిత్రక పాత్రను పరుచూరి భువనేశ్వరీదేవి తన కవిత్వంలో నమోదు చేయటం విశేషం. జాతీయ కాంగ్రెస్‌ని అభిమానించి, మహిళా సమాజాన్ని కూడా ఏర్పరచి కృషి చేసిన దేవులపల్లి సత్యవతమ్మ జాతీయోద్యమంలో స్త్రీలను భాగస్వాములు కమ్మని కోరుతూ ‘’మాలల దుఃఖనిస్వనములన్'’ దయతో చూడమని స్త్రీలను హెచ్చరించింది. (గృహలక్ష్మి సెప్టెంబర్ 1931)
మదమంచి అనంతమ్మ వలనే కనుపర్తి వరలక్ష్మమ్మ కూడా శ్రామిక స్త్రీ జీవనశైలిని కవితా వస్తువుగా చేసుకున్నది. పేదరాలు కవిత ఆ కోవలోదే. ఈ పేదరాలు పగలంతా పలుగురాళ్ళు పగలగొట్టి కూలీ సంపాదించుకునే స్త్రీ. వర్షాలు లేక పంటలు పండక బ్రతుకు వెళ్ళని బడుగు జీవులు భూమిని వదిలి పనిపాటలకై వలసవెళ్ళిన పరిస్థితులను కనుపర్తి వరలక్ష్మమ్మ ఇందులో నమోదు చేసింది.
‘’ పొలపు పాటున్న పుణ్యదినాల యందు కాయయో కంకియో చేతికందుచుండె
ముద్దుబిడ్డలకవి యీయ మరియుచుండ్రి యిపుడు లేదాయొ నా భాగ్య మేమిసేతు
పైరుతల్లి విడిచి పలుగురాళ్ళను గొట్టు కర్మమొదవినపుడె కలిగె లేమి
వాన చినుకురాలి వసుధ రంజిల్లకబాయునెట్టు పేదరాలి క్షుత్తు!'’ - (గృహలక్ష్మి, ఏప్రిల్ 1928)
వానలు లేకపోవటం తదితర కారణాల వల్ల ఏర్పడిన వ్యవసాయ రంగంలోని సంక్షోభం అనేకమందికి ఉపాధి లేకుండా చేయటం డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం కూడా వుంది. వ్యవసాయపు పనులు లేక వాళ్ళు బ్రతుకుదెరువు కోసం వేరే మార్గాలను ఎంచుకోవలసి వచ్చింది. ఐతే అవి వాళ్ళకు సంతృప్తిని, సంతోషాన్ని ఇచ్చేపనులు కాదు, వాళ్ళ కనీస అవసరాలను సంపూర్తిగా తీర్చలేని కూలిపనులు. అవి వారి జీవితాల్లో విషాదాన్నే మిగిల్చాయి. పేదరాలి స్థితి అదే. పేదరికం అనేది స్త్రీ పురుషులిద్దరికి సమంగా బాధాకరమైన విషయమే అయినా పేదరికం బరువు స్త్రీ మీద పడ్డప్పుడు అది మరింత బాధాకరంగా ఉంటుంది. ముఖ్యంగా పిల్లల ఆకలి తీర్చలేని ఆ పేదరికపు తల్లి పడే హింస ఎంత తీవ్రంగా ఉంటుందో పేదరాలి వేదన ద్వారా వ్యక్తీకరించింది కనుపర్తి వరలక్ష్మమ్మ.
సమకాలపు స్వాతంత్య్రోద్యమం స్త్రీలను విశేషంగా ఆకర్షించిన వస్తువు. నాల్గుగోడల కుటుంబ పరిమితిలో నివసిస్తున్న స్త్రీలు తమ స్వాతంత్య్రం కోసమో, దేశ స్వాతంత్య్రం కోసమో వీధులలోకి వచ్చారు. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ సమావేశాలకు హాజరయ్యారు. ఈ విధమైన సమిష్టి కార్యకలాపాలలో భాగస్వామ్యం స్త్రీల అస్థిత్వ చైతన్య ప్రకటనకు ఒక వ్యక్తీకరణ అయింది. ఆ చారిత్రక సందర్భాన్ని సామవేదుల చిరంజీవమ్మ తన కవిత్వంలో నమోదు చేసింది. దేశసేవారక్తులైన స్త్రీలను ‘దేశసేవిక’ అని సంబోధించి వారిని చీకట్లో నుండి వెలుగులోకి వచ్చిన వారిగా సంభావించింది.
దేశ సేవికల ముఖవిలాసమంతా ఎండలో, సముద్ర తీరంలో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని ఉప్పు తీయటం వల్లనో, కాంగ్రెస్ సభలకు వెళ్ళటం వల్లనో వస్తున్నదని ఈ పద్యంలో భావన చేసింది సామవేదుల చిరంజీవమ్మ 1930 మార్చి 12వ తేదీన గాంధీ ఉప్పు సత్యాగ్రహనిమిత్తం దండియాత్రను నడిపించాడు. చారిత్రక ప్రస్థానంగా ప్రస్తావించబడిన ఈ దండి యాత్ర స్త్రీలను ఎంత ఉత్తేజితులను చేసిందో చిరంజీవమ్మ వ్రాసిన కవిత్వం నిరూపిస్తున్నది. స్త్రీల సౌందర్యం సత్యాగ్రహోద్యమంతో ముడిపడి వికసిస్తున్నట్లు భావన చేయటం ఎంతో ఉదాత్తంగా ఉన్నది. కాస్మొటిక్స్ వినియోగం వలనే స్త్రీ సౌందర్యం సాధించబడుతుందనే వర్తమాన వాణిజ్య సంస్కృతికి సమాంతరంగా అభివృద్ధి చేసుకొనవలసిన జాతీయ సౌందర్య సంస్కృతిని గుర్తించిన స్పూర్తిని ఇక్కడి నుండే పొందాలి మనం.
ఓలేటి నిత్య కళ్యాణమ్మ దివ్యాశీస్సు అనే కవితలో (గృహలక్ష్మి, మార్చి 1931) ‘’భారతీ సతి గుండెలందున పల్లవించిన స్వేచ్ఛ భావము'’ లను గుర్తించి చెప్పింది. దేవులపల్లి సత్యవతమ్మ దేశభక్తిని ప్రబోధిస్తూ జాతీయ సేవా దీక్షబూని కదిలి రమ్మని స్త్రీలకు పిలుపు నిచ్చింది.
సంపూర్ణ స్వాతంత్య్రం పొందే వరకు భారతీయులకు ఖద్దరు ధారణ, మద్యపాన నిషేధం,అస్పృశ్యత నివారణ మూడు ముఖ్య కార్యక్షేత్రాలుగా నిర్దేశింపబడ్డాయి. గాంధీ యిచ్చిన ఈ కార్యక్రమాన్ని తమదిగా స్వీకరించి ముందుకు నడవడానికి స్త్రీలు ఎంతగా సంసిద్ధ్దమయ్యారో ఈ పద్యం సూచిస్తుంది. మనభాష మనజాతి మనదేశ అభివృద్ధి మార్గాలను గురించి ఆలోచించాలని దేవులపల్లి సత్యవతమ్మ దేశాభిమానాన్ని వ్యక్తీకరించింది.
అవటపల్లి కృష్ణవేణి ప్రజోత్పత్తి సంవత్సరాది సందర్భంగా కవిత్వం వ్రాస్తూ ‘’నీవైన శాంతి నొడగూర్చి నెగుడుమమ్మ'’ అని కోరింది. గాంధీ - ఇర్విన్ ఒడంబడికను ప్రస్తావించి వాళ్లిద్దరూ కలిసి భారతమాత సంకెళ్ళను విప్పటానికి చేసిన సంకల్పాన్ని ‘’దయ పూర్తి చేయుము'’ అని కొత్త సంవత్సరాదిని కోరింది. (గృహలక్ష్మి మే 1931) అలాగే యం. వేదవల్లి తాయరమ్మ కూడా కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్తూ ‘’శాంతి
సత్యాగ్రహములిచ్చి సరవిగొనుము'’ అని వేడుకుంటుంది. (గృహలక్ష్మి మే 1931) ఆ రకంగా కొత్త సంవత్సర ఆకాంక్షలు దేశ స్వాతంత్య్ర కాంక్షలతో ముడిపడి స్త్రీల కవిత్వంలో వ్యక్తమయినవి.
పురావైభవ సంకీర్తనం కూడా స్వాతంత్య్రోద్యమ చైతన్యంలో ఒక భాగం, జాతీయెద్యమ కాలంలో ప్రాచీన భారతీయ చరిత్రను పత్యేకించి ఆంధ్రప్రదేశ్ చరిత్ర సంస్కృతి వైభవాలను ప్రశంసిస్తూ అనేకమంది కవిత్వం వ్రాశారు. స్త్రీలలో కూడా అలాంటి ప్రయత్నాలు చేసిన వాళ్ళున్నారు. గంటి కృష్ణవేణమ్మ ‘’హంపీ శిథిల స్మృతి'’ అనే ఖండగీతి రచించింది.
జాతీయెద్యమంలో గాంధీ నాయకత్వం ప్రజలకు గొప్ప ఉత్తేజాన్ని ఇచ్చిన అంశం. గాంధీని శ్రీకృష్ణుడిగా సంభావించి ఆరాధించేవరకు అది దోహదం చేసింది. అదే విధంగా మోతీలాల్ నెహ్రూ, పటేల్, జవహర్లాల్ నెహ్రూ, మహమ్మద్ అలీ మొదలైన జాతీయోద్యమ నాయకులు ప్రజలకు ఆరాధ్యులైనారు. అదే క్రమంలో వాళ్ళు కవితా వస్తువు కూడా అయినారు. అందులో భాగంగానే స్త్రీలు కూడా ఈ జాతీయోద్యమ నాయకులను కావ్యనాయకులుగా స్వీకరించి కవిత్వం వ్రాశారు.
దేవులపల్లి సత్యవతమ్మ ‘’రథ చోదితుండ వౌచు రాజిల్లు కేశవున్ మరపించు శ్రీ గాంధీ మహిమ దలచి'’ అని ప్రారంభించిన కవిత్వ రచనలో (గృహలక్ష్మి ఫిబ్రవరి 1931) భారతేతిహాస కథా పాత్రలతో జాతీయోద్యమ నాయకులకు పోలికను భావించి చెప్పింది. భారత యుద్ధంలో రథం నడిపిన కృష్ణుడు వంటివాడు గాంధీ. పటేలును ధర్మరాజని, జవహర్‌లాల్‌ను అర్జునుడని, సుభాష్ చంద్రబోస్‌ను భీముడని పేర్కొని ప్రశంసించింది. దేశరాజు భారతీదేవి బాపూజీ అస్థి నిమజ్జన సందర్భాన్ని కవితాంశంగా చేసికొన్నది. గాంధీజీ అస్థికలు ధరించిన కృష్ణానది భాగ్యాన్ని ప్రశంసించింది. మోతీలాల్ నెహ్రూ మరణానికి సంతాపాన్ని వ్యక్తం చేస్తూ జూలరి తులసమ్మ పదకొండు పద్యాలు వ్రాసింది. భారత జాతికెల్ల శుభాన్ని సంపాదించే పనిలో ఉన్నవాడిని పొట్టన పెట్టుకున్నందుకు దైవాన్నే నిందించిందామె.
జ్ఞానాంబ మహమ్మద్ అలీ మరణానికి సంతాపంగా పద్యాలు వ్రాసింది.
‘’మహిత గుణశాలి శ్రీశ్రీ మహమ్మద్ అలీ
కాత్మ శాంతియు నిడు బరమాత్ముఁ డెలమీ'’ అని ఆకాంక్షించింది. (గృహలక్ష్మి మార్చి 1931)
జాతీయోద్యమకాలంలో స్వదేశీ ఉద్యమంలో, సహాయనిరా్కరణోద్యమంలో, ఉప్పు సత్యాగ్రహోద్యమంలో పాల్గొన్న స్త్రీలు చేసిన కృషి తరచూ విస్మరించబడింది. ఈనాటికి ఉన్న ఇటువంటి పరిస్థితుల్లో 1930లలోనే మహిళలు తమ సమకాలంలోనే జాతీయోద్యమంలో భాగస్వాములైన స్త్రీల నుండి స్పూర్తిని పొందటం, వారిని ఒక ఆదర్శ నమూనాగా భావించటం, వారి ఉద్యమ నిబద్ధతను కేంద్రంగా చేసి కవిత్వం వ్రాయటం విశేషం. ఆ క్రమంలోనే మాగంటి అన్నపూర్ణ జీవితాన్ని వస్తువుగా చేసికొని స్త్రీలు కవిత్వం వ్రాయటం గమనించవచ్చు.
‘’ ఖద్దరు ధరియించి కాల్పుడీ పరదేశ వస్త్రంబులనిన ప్రశస్తవీవు
అంటరాని తనంబు మటుమాయ మొనరింప నిరతంబు మదినెంచు నెలతనీవు
స్వారాజ్యమే స్త్రీల జన్మహక్కని దెల్పి స్వాతంత్య్ర దీక్షకై సాగితీవు
బీదసాదల జూచి ప్రేమతో సర్వంబు ధారవోసిన యట్టి థాత్రివీవు'’ (గృహలక్ష్మి నవంబర్ 1930) అని కుడితిపూడి అచ్చమాంబ అన్నపూర్ణను ప్రశంసించింది. ఖద్దరు ధరించటం, విదేశీ వస్త్రాలను దహించటం, అంటరానితనాన్ని నిరసించటం, జాతీయోద్యమం ఇచ్చిన కార్యక్రమాలు. ఆ కార్యక్రమాలను, ఆచరణలో పెట్టటం తన జీవితంలో భాగంగా చేసుకొన్న మహిళ మాగంటి అన్నపూర్ణ. స్వారాజ్యం నా జన్మహక్కు అన్నది తిలక్ ఇచ్చిన నినాదం. ఆ నినాదాన్ని స్వారాజ్యమే స్త్రీల జన్మహక్కు అని మార్చి స్వాతంత్య్రాన్ని స్త్రీల ఆకాంక్షగా వ్యక్తీకరించింది మాగంటి అన్నపూర్ణ. స్త్రీలుగా అప్పుడప్పుడే స్వాతంత్య్ర స్పృహను పొందుతూ దానిని దేశస్వాతంత్య్రోద్యమంలో భాగంగా వెతుక్కుంటున్న ఒక దశకు మాగంటి అన్నపూర్ణ ఒక బలమైన ప్రతీకగా కుడితిపూడి అచ్చమాంబ లాంటి స్త్రీలకు తోచి ఉంటుంది. అది ఆమె పట్ల గౌరవంగా, ఆరాధనగా వ్యక్తమైంది. ఆ క్రమంలోనే మాగంటి అన్నపూర్ణ జీవితం కావ్యవస్తు గౌరవాన్ని పొందింది.
అయితం ఇందిరా భారతి అక్కా చెల్లెళ్ళు జంటకవులు. అన్నపూర్ణ సుభాషిత రత్నావళి అనే పద్య కావ్యం వ్రాశారు. మాగంటి అన్నపూర్ణాదేవి భర్త బాపినీడు ఉన్నత విద్యకు అమెరికా వెళ్ళాడు. ఆమెకు వెళ్ళటం సాధ్యపడలేదు. అతని గురించే ఆలోచిస్తూ పరిపరి విధాల పోయే తన బుద్ధిని మనస్సును నియంత్రించుకుంటు సత్యాగ్రహ ఉద్యమంలో చేరింది. అప్పటినుండి భర్తను కూడా ఉద్యమంలో చేరమని ప్రోత్సహిస్తూ ఉత్తరాలు వ్రాసింది. మాగంటి అన్నపూర్ణాదేవి భర్తకు వ్రాసిన ఆ లేఖాంశాలే కవితా వస్తువుగా చేసుకున్నారు ఇందిర, భారతి. అన్నపూర్ణ అనుభవించిన భర్తృవిరహాన్ని, దేశభక్తి నిబద్ధతను ఈ కావ్యంలో చక్కగా వర్ణించారు. అసహాయ ఉద్యమాల్ని నడుపుతున్న గాంధీని ఆమె దివ్యమూర్తిగా భావించటం ఏలూరు, బెజవాడ సమావేశాలలో గాంధీజీకి తన ఒంటి మీద ఉన్న నగలన్నీ అర్పించి నూలు గుడ్డలు కట్టుకోవటం మొదలైన అంశాలను కవయిత్రులు ఇందులో ప్రశంసించారు.
‘’కాల్చనిచ్చితి భక్తితో గాంధీకేను
రెండువెల్సేయు పట్టు చీరెలను, మఱియు
బెండ్లి చీరను గడ నర్పించుకొంటి
వలయుచో బ్రాణమే నిత్తు భరత ధరగు'’
‘’పెండ్లి యుంగరమును గడ బ్రీతితోడ
తిలకు నిథి కిచ్చినాను, మీ విలువ గలుగు
చేతి గడియార మిచ్చితి జేతమలర
నకట! మిము నిచ్చుకొనెడు భాగ్యంబు లేదు.'’
అని తన భర్తను జాతీయోద్యమ కార్యాచరణకు సుముఖుడిగా చేసుకొన లేకపోవటం గురించి బాధపడినట్లుగా వాళ్ళు వ్రాశారు. అమెరికాకు భర్త దగ్గరికి పోవటం కంటే స్వాతంత్య్రాన్ని ఆశించి స్వరాజ్యం కోసం పాటుపడుతున్న భారతీయులలో ఒక వ్యక్తిగా తనకు అర్హమైనది ‘’దేశసేవా ప్రకార సద్దీక్ష'’ అన్న చైతన్యాన్ని కనపరిచిన స్త్రీ మూర్తిగా అన్నపూర్ణను దర్శించి కీర్తించారు ఇందిరా, భారతి.
జాతీయోద్యమ కాలపు కవయిత్రులకు మాగంటి అన్నపూర్ణ తర్వాత కావ్య వస్తువైన మరొక స్త్రీ మీరాబాయి (స్లేడు) ఆంగ్లకన్య. భారత స్వాతంత్య్రాన్ని కాంక్షించి గాంధీ శిష్యురాలై మీరాబాయిగా ప్రసిద్ధి చెందింది. ఈమెను కీర్తిస్తూ ఓలేటి నిత్య కళ్యాణమ్మ, దేవులపల్లి సత్యవతమ్మ కవిత్వం వ్రాశారు.
ఈ విధంగా స్త్రీల కవిత్వం జాతీయోద్యమ ఆదర్శాలను జాతీయోద్యమంలో క్రియశీల పాత్ర వహించిన వ్యక్తుల చరిత్రను గౌరవాభిమానాలతో నమోదు చేసింది.దయ సాహిత్య ఉద్యమంతో ముడిపడి తన కవితా శక్తిని వికసింపచేసుకున్న స్త్రీ వట్టికొండ విశాలాక్షి. ఒక వైపు అంతర్జాతీయ కమ్యూనిస్టు తాత్వికత మరొక వైపు దేశీయ స్వాతంత్య్ర ఆకాంక్ష రెండూ ఆమె కవిత్వంలో పెనవేసుకొని ఆవిష్కరించబడ్డాయి. 1942 జూలైలో క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైంది. అందులోకి భిన్నవర్గాల ప్రజా సమూహాలను కల్పుకొని రావాలని గాంధీ ఆకాంక్షించాడు. అందులో భాగంగానే జాతీయెద్యమంలోకి స్త్రీల సమీకరణ ఆనాడు ఒక ప్రధాన కార్యక్రమం అయ్యింది. ఆ నేపథ్యంలో వట్టికొండ విశాలాక్షి ప్రబోధం అనే శీర్షికతో ఒక ఖండిక వ్రాసింది.
‘’స్వేచ్ఛ కావాలంటూ స్త్రీలే అడగాలి. సాహసముతో స్త్రీలే సాగిరావాలి'’ అని స్త్రీల స్వేచ్చకు హామీ లభించినప్పుడే దేశ స్వాతంత్య్రం సాధ్యమవుతుందన్న దృక్పథాన్ని కనబరిచింది. స్త్రీలు స్వేచ్ఛ సాధించబడినప్పుడే స్వాతంత్య్ర పోరాటం సమర్థవంతంగా సాగుతుందని ముందుగా పురుషులకు అర్థం కావాలి! స్వేచ్ఛా పిపాస స్త్రీలలో సమాంతరంగా అభివృద్ధి చెందాలి. అది విశాలాక్షి ఆకాంక్ష. స్త్రీలను జాతీయోద్యమంలోకి సమీకరించటమే కాదు సామ్రాజ్యవాద వ్యతిరేక యుద్ధంలోకి కూడా వాళ్ళను ఆహ్వానించే చైతన్యం ఆమెది.
‘’ఫాసిస్టు శత్రువుల పాతిపెట్టాలి
సబలలమేమంచు చాటి చెప్పాలి'’ అన్నది విశాలాక్షి ఆదర్శం. స్త్రీల విముక్తి ఫాసిస్టు వ్యతిరేక ప్రజావిప్లవంతో ముడిపడి వున్నదని కమ్యూనిస్టుగా విశాలాక్షి నమ్మకం. అందుకనే ఫాసిజాన్ని సర్వనాశనం చేయటం స్త్రీలకు కార్యక్రమంగా ఇచ్చింది ఆమె.
ఒక వైపు సంప్రదాయ స్త్రీ ధర్మాలను శిరసును ధరించి ఆ ధర్మాచరణమే స్త్రీ ఆదర్శమని కవిత్వం వ్రాస్తూ మరొకవైపు సమకాలీన భావకవితా ఉద్యమ ప్రభావంతో ప్రకృతిని వర్ణిస్తూ గొప్ప భావుకతతో స్త్రీలు కవిత్వం వ్రాశారు. చావలి బంగారమ్మ భావకవుల ఊహా ప్రేయసి, విరహ భావన స్థానంలో పతి విరహాన్ని నిలపి నివేదన అన్న శీర్షిక క్రింద కవిత్వం వ్రాసింది. (భారతీ జూలై 1932) అంతేకాదు ఇంత సంప్రదాయ చట్రంలో కూడా స్త్రీలు కావటం వలన తాము ప్రత్యేకంగా పొందుతున్న అనుభవాలను, అనుభతులను, ఆవేదనలను కూడా ఆనాడు స్త్రీలు అరుదుగా నైనా సరే తమ కవిత్వంలో నమోదు చేశారు. స్త్రీ పురుష సమానత్వాన్ని చెప్పటానికి ప్రయత్నించారు. మదమంచి అనంతమ్మ పల్నాటి యుద్ధకథను రెండు కావ్యాలుగా వ్రాసింది. మాంచాల అనే కావ్యంలో బాల చంద్రుని వేశ్యా వ్యసనం పట్ల మాంచాలకున్న తీవ్ర వ్యతిరేకతను నిరసన స్వరంతో మాంచాల ముఖంగా వ్యక్తీకరించింది. బాల చంద్రుడు పల్నాటి యుద్ధంలో పాల్గొనడానికి మాంచాల దగ్గర అనుమతి తీసుకోవల్సి వచ్చింది. తన ఇంటికి వచ్చిన భర్తను ఆహ్వానించి మాంచాల అతని దక్షణ పాదాన్ని (కుడి కాలును) కడిగింది. రెండవ కాలును కడగలేదని ప్రశ్నిస్తూ బాలచంద్రుడు ఇది మీ పుట్టింటి వారి మర్యాదా లక్ష్మణమ్మ అని భార్యను ఎత్తి పొడిచాడు. ఆ పాదం సాని సబ్బాయిది కనుక తాను కడుగలేదని చెప్పి అతను మొత్తం తన మనిషి కాదు అన్న వాస్తవాన్ని నిరసన స్వరంతో చెప్పింది. నాయకురాలు కావ్యంలో నాగమ్మ ముఖంగా ఆడుది సింహాసనం మీద కూర్చుంటే భరించలేని పురుషాధికార అహంకారాన్ని ఎత్తి చూపింది అనంతమ్మ.
అయ్యదేవర బాలా త్రిపుర సుందరమ్మ టీచర్స్ ట్రైనింగు సందర్భంగా అది శిక్షణగా తన అనుభవంలోకి వచ్చిన తీరును విమర్శిస్తూ పద్యాలు వ్రాసింది. వ్రాసిందే వ్రాయటం, నోట్స్ ఆఫ్ లెస్సన్స్ వ్రాయటం, వేళాపాళాలేని డ్రిల్‌కి హాజరు కావల్సి రావటం, హాజరు కాలేకపోతే డాక్టర్ సర్టిఫికెట్ సమర్పించాల్సి రావటం ఇవన్నీ ట్రైనింగును పెద్ద గండంగా భావించేటట్లు చేస్తున్నాయని ఈమె కవిత్వం చెపుతుంది. పబ్లిక్ ప్రపంచానికి అందులోను విద్యావ్యవస్థకు సంబంధించిన స్త్రీల అనుభవాన్ని తొలిసారిగా నమోదు చేసిన కవయిత్రిగా అయ్యదేవర బాలా త్రిపుర సుందరమ్మ కనబడుతుంది.
స్త్రీలు ఇంటికే పరిమితమైనా, అధ్యాపకులుగా గాని మరే వృత్తి ఉద్యోగాలలోకి గాని, ఉద్యమాలలోకి గాని ప్రవేశించినా కవిత్వం వ్రాయటానికి పూనుకొన్నా - వారందరికి ప్రధానమైంది ఇంటి పని, పిల్లల పెంపకమే. ఆ రెండు ప్రధాన విధులను నిర్వర్తించిన తరువాత దొరికే సమయంలోనే, మిగిలిన శక్తితోనే ఆమె తన అస్థిత్వ నిరపణకు, వ్యక్తిత్వ వికాసానికి అవసరమైన, ఆసక్తి కల్గిన కార్యాలు చేపట్టాలి. గిడుగు లక్ష్మీకాంతం, జొన్నలగడ్డ శారదాంబ వ్రాసిన ‘’లేఖదత'’ అనే కావ్యం ఇందుకు సాక్ష్యమిస్తున్నది. భర్త ఉద్యోగం వలన వేర్వేరు చోట్ల ఉన్న భార్యాభర్తల మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాల రూపంలో ఉన్న కావ్యం ఇది.
‘’పిల్లల కోడి నౌట తెరపించుక లేదిక, నేమిసేతు నే
నిల్లును దిద్దుకొంచు నొక యించుక తెన్నొకటబ్బెనేని నే
నుల్లస మంది యత్తరిని నోపిక దెచ్చుక కొన్ని పద్యముల్
జల్లగ వ్రాయు జూతు సుమి! చారుగుణాకర! శ్రీ మనోహరా!'’
ఇది ఒక భార్య వేదన, పిల్లల కోడి కావటం వలన విశ్రాంతి లేకపోవటం, ఇల్లు దిద్దుకొనటంలో కాస్త కూడా తీరిక దొరకక పోవటం, ఆమె స్థితి. పద్యాలు వ్రాయటం ఆమె ఆసక్తి. అందుకు ఆమె ఉల్లాసాన్ని, ఓపికను కూడా ప్రయత్నపూర్వకంగా తెచ్చుకోవల్సిందే. ఓపిక దెచ్చుక కొన్ని పద్యముల్ జల్లగ వ్రాయ జూతు సుమీ'’ అని చెప్పటంలో వ్యక్తమైంది ఆ ఒక్క స్త్రీ స్థితి మాత్రమే కాదు. కవిత్వ రంగంలో ఉన్న స్త్రీలందరి స్థితికి ఇది ప్రాతినిధ్యం వహిస్తుంది. ఇన్ని ఒత్తిడులకు మధ్య, వ్యతిరేక పరిస్థితుల మధ్య స్త్రీలు కవిత్వ రచన చేయాల్సి వస్తున్నది కనుకనే వాళ్ళు అనుకున్నంత స్థాయిలో వ్రాయలేరు. ప్రధాన స్రవంతి పురుష కవి ప్రపంచంలో తమకొక స్థానాన్ని పొందలేరు. 1930ల నాటి ఈ స్థితిని దాటి స్త్రీల కవిత్వ ప్రపంచంలో స్త్రీల గమనం ఏ దిశగా సాగిందో, ఏ గమ్యాన్ని చేరిందో కళ్ళముందున్న వర్తమానంతో పోల్చి మనమిప్పుడు బేరీజు వేసుకోవలసి ఉన్నది.
Thursday, August 14, 2008
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment