Tuesday, February 23, 2010

కిటికీ తెరిస్తే


కిటికీ తెరిస్తే
ఏపుగా పెరిగిన చెట్టుమీద ఎర్రని పువ్వొకటి విరిసి
ఎండలో మెరుస్తూ ఇదేనిజం ఇదేనిజం అని నవ్వుతూ
అంతలో రాలిపొయింది
వింతగా స్మృతిలో మాత్రం మిగిలింది.


    
19-11-1997...........05-02-2009
                                                                                                                  
                                                  

Sunday, February 14, 2010

ఆధ్యాత్మికవాదం... హేతువాదం

ఆధ్యాత్మికవాదంలో ఆలోచన తాకట్టు పడుతుంది. అందులో మనిషి పెరగడు. హేతువాదం అనంతం. నిరంతర శాస్త్రీయ దృక్పథంతో సాగిపోతూ కొత్త విషయాలను స్వీకరిస్తూ తమ పాత విషయాలను సరిదిద్దుకుంటూ పోతుంటుంది. ఇది అభ్యుదయ విధానం.

Friday, February 12, 2010

అమృతం కురిసిన రాత్రి

అమృతం కురిసిన రాత్రి
అందరూ నిద్రపోతున్నారు
నేను మాత్రం
తలుపు తెరిచి ఇల్లు విడిచి
ఎక్కడికో దూరంగా
కొండదాటి కోనదాటి
వెన్నెల మైదానంలోకి
వెళ్ళి నిలుచున్నాను.

ఆకాశం మీద అప్సరసలు
ఒయ్యారంగా పరుగులెత్తుతున్నారు
వారి పాదాల తారామంజీరాలు
ఘల్లు ఘల్లని మ్రోగుతున్నాయి
వారి ధమ్మిల్లాల పారిజాతాలు
గుత్తులు గుత్తులై వేలాడుతున్నాయి
వారు పృధు వక్షోజ నితంబ భారలై
యోవన ధనుస్సుల్లా వంగిపోతున్నారు.

నన్ను చూసిచూసి కిలకిల నవ్వి ఇలా అన్నారు
చూడు వీడు
అందమైన వాడు
ఆనందం మనిషైనవాడు
కలల పట్టు కుచ్చులూగుతూన్న కిరీటం ధరించాడు
కళ్ళ చివర కాంతి సంగీత గీతాన్ని రచిస్తున్నాడు

ఎర్రని పెదవులమీద తెల్లని నవ్వుల వీణల్ని మీటుతున్నాడు
ఎవరికీ దొరకని రహస్యాల్ని వశపరుచుకున్నాడు
జీవితాన్ని ప్రేమించినవాడు జీవించడం తెలిసినవాడు

నవనవాలైన ఊహవర్ణార్ణవాల మీద ఉదయించిన సూర్యుడు
ఇతడే సుమీ మన ప్రియుడు,నరుడు,మనకి వరుడు

జలజలమని కురిసింది వాన
జాల్వారింది అమృతంపు సోన
దోసిళ్ళతో తాగి తిరిగి వచ్చాను
దుఃఖాన్ని చావుని వెళ్ళిపొమ్మన్నాను
కాంక్షా మధుర కాశ్మీరాంబరం కప్పుకున్నాను
జీవితాన్ని హసన్మందార మాలగా భరించాను
జైత్రయాత్ర పధంలో తొలి అడుగు పెట్టాను.


అమృతం కురిసిన రాత్రి
అందరు నిద్రపోతున్నారు
అలసి నిత్యజీవితంలో సొలసి సుషుప్తి చెందారు
అలవాటునీ అస్వతంత్రతనీ కావలించుకున్నారు
అధైర్యంలో తమలో తాము ముడుచుకుపోయి పడుకున్నారు
అనంత చైతన్యోత్సవాహ్వానాన్ని వినిపించుకోలేక పొయారు

అందుకే పాపం
ఈనాటికీ ఎవరికీ తెలియదు
నేను అమరుడని

-తిలక్